Sunday, August 14, 2016

చీకట్లోంచి వెలుగుకు నడిపిన అతల కుతల పాతాళం



"నిత్యం సుడిగుండం
సమయంతో సమరం చేసేయ్ సాగర మథనం 
నిన్నే నువ్వు శోధించుకుంటూ...
నిన్నే నువ్వు సాధించుకుంటూ...
నిన్నే నువ్వు శాసించుకుంటూ...
నీకై నిన్ను గెలిపించుకుంటూ...
సాగిపో... సాగిపో... సాగిపో...!!!
అతల కుతల పాతాళం... అయోమయం ఈ భూగోళం...."

చీకట్లోనే ఉండాలనుకుంటే ఆ చీకటి నిన్ను కదపదు... వెలుగు కావాలనుకుంటే మాత్రం ఒక అడుగు వేయకతప్పదు. అదే పని శ్రవణ్ పండ్రంగి చేశాడు. తను అందరిలా చీకట్లో ఉండకుండా వెలుగు కోసం అడుగు ముందుకేశాడు. ఆ అడుగు ఫలితమే ''అతల కుతల పాతాళం'' అనే షార్ట్ ఫిలీం.

శ్రవణ్... 29 సంవత్సరాల ఈ కుర్రాడు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే. ఎం.టెక్ చదువుతున్న శ్రవణ్ కి ఫోటోగ్రఫి అంటే పిచ్చి. దాంతో 2011లో ఎం.టెక్ కి స్వస్తి చెప్పి కొన్ని ఫీచర్ ఫిలీంలకు, షార్ట్ ఫిలీంలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా చేశాడు. అనంతరం ''అప్పారావు గారి అబ్బాయిని'' అనే షార్ట్ ఫిలీంకు కెమెరామెన్ గా పనిచేశాడు. మాటివీ నిర్వహించిన పోటీలో ఆ షార్ట్ ఫిలీంకు మూడవ బహుమతి వచ్చింది. అటుతర్వాత 2014లో తనకులాగే ఉత్సాహం ఉన్న శ్రీమాన్ (దర్శకుడు మరియు కెమెరామెన్) తో పరిచయం జరిగింది. ఇద్దరు కలిసి 'శ్రవణ్ శ్రీమాన్ విజువల్స్' అనే బ్యానర్ ని ప్రారంభించి, పనోరమా అనే 15 నిముషాల నిడివి గల మూకీ షార్ట్ ఫిలీంను తీశారు. అతల కుతల పాతాళం వీరి రెండవ ప్రాజెక్టు.

అతల కుతల పాతాళం.. ఒక తండ్రి, ఇద్దరు కొడుకుల కథ. తండ్రి చిరుద్యోగి. చదువులు అయిపోయిన ఇద్దరు కొడకులకు, తెలిసిన వాళ్ల దగ్గర ఉద్యోగాలు ఇప్పించి వారి భవిష్యత్ తీర్చిదిద్దాలనుకుంటుంటాడు. కానీ, వారిద్దరికి ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. పెద్దవాడు కథలు రాస్తుంటాడు. చిన్నవాడు నాటకసంస్థలో యాక్టింగ్ నేర్చుకుంటుంటాడు. కానీ, ఈ విషయం తండ్రకి చెబితే ఏమంటాడో అన్న భయంతోనే, ఒకరోజున తన తండ్రికి చెప్పేస్తారు. అది విన్న తండ్రి, కొడుకులను వారి నిర్ణయానికి వదిలేసి వాళ్ల భవిష్యత్తు గురించి బాధపడుతుంటాడు. కొన్నిరోజుల తరువాత... పెద్దొడు రాసిన కథతో ఒక నాటకం తయారుచేసి, ఆ నాటక ప్రదర్శనకు తండ్రిని ఆహ్వానిస్తారు. అయిష్టంగానే వెళ్లిన తండ్రి నాటక ప్రదర్శనలో తన కొడుకుల ప్రతిభలను చూసి పుత్రోత్సాహంతో చప్పట్లు కొడుతాడు.

తల్లిదండ్రులు తమ కోరికలను తమ పిల్లలకు రుద్దొద్దని, వారికి ఇష్టమున్న రంగంలోకి వారిని పంపించాలని చెబుతూనే... పిల్లలు కూడా తమ ఇష్టాలను వారివారి తల్లిదండ్రులకు చెప్పాలని తెలియజేసింది. ప్రతివాడికి ఒక లక్ష్యం, ఇక విజన్ ఉంటుందని అది తెలసుకోని దానికోసం ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని చూపించింది.

టెక్నాలజీ పెరిగిన తరువాత ఎవరు పడితేవారు షార్ట్ ఫిలీంలను తీస్తున్నారు. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రొఫెషనల్ గా ఉంటున్నాయి. ఆ కొన్నింటిలో ఒకటే ఈ అతల కుతల పాతాళం. కంటెంట్ తెలిసినదే అయిన కథను నడిపించిన విదానం బాగుంది. ఫోటోగ్రఫి, మ్యూజిక్ కూడా బాగున్నాయి. లైటింగ్ ప్రోపెషనల్ గా ఉంది. ఇక నటన విషయానికొస్తే నటులందరూ బాగానే చేశారు. మల్లాది గోపాలకృష్ణ గారు చెప్పిన వాయిస్ వోవర్, ఆ వాయిస్ వోవర్ మీద వచ్చన ఆర్ట్ వర్క్ బాగుంది.

మోహన్ శివలెంక, తిరువీర్, పవన్ రమేష్, శ్రీనివాసరావు పోలుదాసు, నయీమ్, రోహిత్ కుమార్ నటించిన ఈ షార్ట్ ఫిలింకు ఆర్ట్: క్రాంతి ప్రియం, సినిమాటోగ్రఫి: శ్రీమాన్ కీర్తి, ఎడిటింగ్: వెంకట్ కళ్యాణ్, మ్యూజిక్: అశిక్ అరుణ్, రచన మరియు దర్శకత్వం: శ్రవణ్ పండ్రంగి.

ఇంక ఆలస్యమెందుకు మీరు కూడా అతల కుతల పాతాళం పై ఓలుక్కేయండి.

అతల కుతల పాతాళం (అతల కుతల పాతాళం వీడియో లింక్)

No comments:

Post a Comment