Saturday, July 04, 2015

2015 నంది నాటకోత్సవ ఫలితాల్లో సీనియర్ జడ్జీల జులూం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నంది నాటకోత్సవం మరోసారి వివాదాల పాలు కాబోతుంది....
2013, 2014 నంది నాటకోత్సవానికి నాణ్యతలేని నాటకాలను ఎంపిక చేశారన్న అప్రదిష్ట దారిలోనే, ఫలితాలు కూడా ఉండబోతున్నాయనీ... ఎన్నో ఏళ్లుగా నటిస్తూ తమకు పరిచయం ఉన్న సీనియర్ నటులను ఉత్తమ నటులుగా, తమకు సన్నిహితంగా ఉంటున్న నటీమణులను ఉత్తమ నటీగా ఎంపికచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని తెలిసింది..
‘‘యువత నాటకరంగానికి రావాలి, నాటకాల్లో నటించాలి, నాటకాల్ని దర్శకత్వం చెయ్యాలి, నాటకోత్సవాలకు జడ్డీలుగా వ్యవహరించాలని’’ వేదికనెక్కి మైక్ దొరగ్గానే ఉపన్యాసాలు దంచే ‘‘పెద్ద’’ మనుషులు... ఆ వేదిక దిగగానే తాము మాట్లాడిన విషయాలు మరిచిపోతున్నట్లున్నారు.
ఇప్పుడు జరుగుతున్న నంది నాటకోత్సవానికి కొంతమంది యువకులను జడ్జీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ నియమించి, ప్రతి విభాగంలో ఇద్దరు సీనియర్ జడ్జీలు, ఒక యువ జడ్జీ ఉండేలా చూసింది.
అయితే సీనియర్ జడ్జీలు, యువ జడ్జీ యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా...‘‘నువు చాలా చిన్నోడివి, నీకు వీటి గురించి తెలియదు, మేం చెప్పినట్టు విను’’ అంటూ బెదిరిస్తున్నారని తెలిసింది. వారికి పరిచయమున్న నాటకసంస్థ దగ్గర రూ. 30,000/- డబ్బు తీసుకొని, అన్ని బహుమతులు ఆ నాటక సంస్థకే వచ్చేలా ఫలితాలని ప్రకటించబోతున్నారనీ...ఇదంతా ఒక నాటకరంగ ప్రముఖుడి కనుసన్నల్లో నడుస్తుందని, దీనికి రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ కూడా వత్తాసు పలుకుతుందని విశ్వసనీయ సమాచారం.
అంతేకాకుండా ప్రాంతీయ విభేదాలు కూడా చూపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి ఎంపికైన ‘‘రజాకార్’’, ‘‘కొమరంభీం’’ నాటకాలు అసలు పోటీలోనే లేవు అని ఒక సీనియర్ జడ్జీ వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నాటకోత్సవంలో తెలంగాణ ప్రాంత నాటకాలకు బహుమతులు రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని వినికిడి.
ప్రతి ఒక్క తెలుగు నాటకరంగ కళాకారుడు కలలుకనే నంది నాటకోత్సవం కూడా రాజకీయం అయిపోతుందని యువకళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..... ప్రణయ్ (29.05.2015)











No comments:

Post a Comment